Home SSC 10th Class తెలుగు వ్యాకరణం

తెలుగు వ్యాకరణం - క్రియా వాక్యములు

క్రియా వాక్యములు

వాక్యం : విషయం అర్థవంతముగా, సంపూర్ణముగా స్పష్టముగా భావప్రకటన కలిగించెడి పదముల సముదాయమును వాక్యం అంటారు. వాక్యములో మూడు ప్రధానమైన భాగాలు ఉన్నాయి.

సమాపక క్రియ - పూర్తి అయినటువంటి క్రియ.
దీనినే ప్రధాన క్రియ అని కూడా అంటారు.

సీత భోజనం తిన్నది.
సీత బడికి వెళ్ళింది

అసమాపక క్రియ - పూర్తి కానటువంటి క్రియ.

సీత బడికి వెళ్లి ..

వీటన్నింటిలో కర్త కర్మ క్రియ ఉంటాయి.

కర్త : ఒక పనిని చేయువారు.
కర్మ: ఆ పని యొక్క ఫలితములను అనుభవించునది.
క్రియ: పనిని తెలియజేయు పదము.

సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అంటారు.

ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.

అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అంటారు.

ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,

అవాంతర వాక్యము: ఒక సంపూర్ణము కాని వాక్యమును, ప్రసంగమున మధ్యలో వచ్చెడి వాక్యమును అవాంతర వాక్యము అంటారు.

ఉదా: తగిన ఇంధనము లేనిచో విమానము ఎగురలేదు.

సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్ధము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు.

ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.

సంయుక్త వాక్యం: వాక్యంలో కర్త,కర్మ,క్రియలలో ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ఉండి, అవి మరియు, లేదా, కావున, కాబట్టి, వంటి సముచ్చాయలతో సంధానింపబడితే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు.

ఉదా: రాము మరియు రాజు గద్వాలకు వచ్చారు. వానలు బాగా పడినవి కాబట్టి పంటలు పండాయి.

కర్తరి వాక్యం : కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు.కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. 

ఉదా: రాముడు రాక్షసులను సంహరించాడు - కర్తరి వాక్యం;

కర్మణి వాక్యం:  కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణి వాక్యాలు.

రామునిచే రాక్షసులు సంహరింపబడిరి - కర్మణి వాక్యం.

కర్మణి ప్రయోగం అనేది తెలుగు భాషలో సహజంగా లేదు. ఇది ఇతర భాషల నుండి తెలుగు లోనికి వచ్చింది. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది.

ప్రశ్నార్థక వాక్యాలు: సమాధానాన్ని ఆశించి అడిగేది ప్రశ్న. అలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు.

ఉదా: రాణి పాఠాలు చదువుచున్నదా ? ఏమిటి, ఎందుకు, ఎలాగ, ఎవరు, ఎక్కడ, ఏది? మొదలైనవి ప్రశ్నలకు మూలాలైన ప్రశ్నార్థక పదాలు..