Home SSC 10th Class తెలుగు ( 10 వ తరగతి )

పార్ట్ I

పార్ట్ I

కవి పరిచయం

డాII దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై వ్యతిరేక ప్రజా పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమకవి. 'నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టాడా'నన్నాడు. పద్యాలను జైలు గోడల మీద రాసి ప్రజల హృదయాల్లో మహాకవిగా స్థానం పొందాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమ్రితాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి (నాటికలు) వంటి పలు గ్రంథాలను రచించాడు. సినీ గేయకవిగా ఆణిముత్యాలవంటి పాటలు రాసి సినిమాపాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకవచ్చాడు.

తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో  గాలిబ్ గజళ్ళను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1967) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974) అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి. అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ, ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం పద్య ప్రక్రియను చెందినది. చారిత్రక వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకొని ఆధునిక భావ వ్యక్తీకరణ రాసిన పద్యాలివి. డాII దాశరథి కృష్ణమాచార్య రచించిన "దాశరథి సాహిత్యం" ఒకటవ సంపుటి 'రుద్రవీణ'లోనిది.

పాఠ్యాంశ నేపథ్యం/ఉద్దేశం

తెలంగాణ వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడినవారు ఒకరైతే, అక్షరాయుధంతో పోరాడినవారు మరొకరు. సాహితియోధుడు డాII దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమౌతూనే సాటి వీరుల సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు.

వీరుల త్యాగాలను చరిత్రపుటల్లోకి ఎక్కించి భావితరాలకు స్ఫూర్తి  నింపి, ఇటువంటి వీరులను కన్నా 'తెలంగాణ తల్లి' గొప్పదనాన్ని కీర్తించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం!

1. భూమండలమంతా ధ్వనించడం

దాశరథీ వీరతెలంగాణ పాఠంలో-నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ర్టం (తెలంగాణ) విముక్తమైన సందర్భంలో యావత్తు తెలంగాణ రాష్ర్టం సాగించిన స్వేచ్ఛా పోరాటపు శంఖధ్వని ఈ భూతలమంతా బొబ్బలు పెట్టినట్లు ఊహించి (ఉత్ప్రేక్ష ద్వారా) ప్రకటించాడు. భూమండలమంతా ప్రతిధ్వనించడమంటే-ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఆ నినాదం తాకిందని చెప్పడం. ఇది పోరాట తీవ్రతను ప్రతిబింబిస్తుంది.

2. బతుకు తోవ చూపే కాలం రావడం

బతకడానికి ఆధారాన్ని, బతుకుకు ఆధారమైన మార్గాన్ని ‘బతుకుబాట’ లేదా ‘బతుకు తోవ’ అంటారు. తెలంగాణలో సామాన్యులు తమ దారిలో తాము సంపాదించుకునే అవకాశాల్లేవు. అలాంటి పరిస్థితుల్లో నిజాం రాష్ర్ట (తెలంగాణ) విముక్తి పోరాటం సాగింది.రాష్ర్టం స్వతంత్రమై ప్రజలు ఎవరి బతుకు వాళ్లు బతకగలిగే పరిస్థితులేర్పడ్డాయి. ఈ కాలం/పరిస్థితుల గురించి చెబుతూ ‘బతుకు తోవ చూపేకాలం వచ్చింది’ అని అన్నారు కవి. మరొక అర్థంలో చచ్చేకాలం పోయి బతికే కాలం వచ్చిందని భావం.

3. తెలంగాణ నేలలో కాంతి

‘తెలుగు రేగడిలో జిగిమెండు’ అన్నది దాశరథీ ప్రయోగం. అంటే తెలంగాణ నేలలో కాంతి అధికం. అంటే ఇక్కడ నివసించే వాళ్లలో తేజస్సు, ఉత్సాహం, బుద్ధి మొదలైనవి ఎక్కువ అని అర్థం. అయితే ‘రేగడిలో జిగి’ అనే ప్రయోగం చేయడం వల్ల ఈ ‘జిగి’ కాంతికి పర్యాయపదంగా కాక పట్టుదలకు ప్రతీకగా భావించవలసి ఉంటుంది. రేగడినేల సహజంగా ‘జిగి’ అంటే పట్టుగలిగి ఉంటుంది. అంటే ఇక్కడి వాళ్లలో పట్టుదల ఎక్కువ అని చెప్పడం కవి ఉద్దేశం.

4. గడ్డిపోచ కత్తిగా మారడం

సాధారణంగా ‘గడ్డిపోచ’ అనే మాటను తేలికైంది, పనికిరానిది, అల్పమైంది అనే అర్థంలో వాడతారు. తెలంగాణలోని గడ్డిపోచలు కూడా ఖడ్గాలు ధరించి యుద్ధరంగంలోకి దిగాయని దాశరథి పేర్కొనడంలో ఉద్దేశం-ఇక్కడ నివసించే అల్పులు అంటే స్త్రీలు, బాలురు, వృద్ధులు, బలహీనులు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్లు కత్తులుగా మారి యుద్ధంలోకి దూకారని చెప్పడమే.

5. నవోదయం రావడమంటే

కొత్త ఉదయం’ అనేది ప్రతినిత్యం ఉండే దే. అయితే ప్రతిరోజూ చీకటి వస్తుంది. ఆ చీకటిని చీలుస్తూ కొత్త వెలుగు ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చీకటి ఒక్క నాటిది కాదు. తరతరాలుగా పట్టిపీడించిన దుష్పరిపాలన అనే చీకటి తొలగిపోయి కొత్త ఉదయం వచ్చిందని చెప్పడమే కవిభావం.

6. తెలంగాణ వీరుల ప్రత్యేకత

తెలంగాణ వీరులు ఆగని తమ పోరాట పటిమతో స్వాతంత్య్రమనే సూర్యుడిని పిలిచి, ఈ నేల అంతటా కాంతి సముద్రాలు ఉప్పొంగేటట్లు చేశారు. కాంతి సర్వత్రానిండేది. అది సముద్రమైనప్పుడు అణువణువునూ తడుపుతుంది. ఈ ప్రయోగం చేయడం వల్ల దాశరథి స్వాతంత్య్రం గొప్పతనాన్ని, తెలంగాణ దాన్ని అనుభవించిన విధానాన్ని చాలా నిండుగా వర్ణించాడు. ఇది సాధించిన వీరుల గొప్పతనం చెప్పకనే చెప్పాడు. అంతేకాదు. ఇక్కడి వీరులు సామాన్యులుకారు. మతపిశాచం కోరలు సాచి భయంకరంగా విజృంభిస్తున్న సమయంలో, అది భయంకరంగా గొంతులు కోస్తున్నా, దిక్కుతోచని పరిస్థితులు దాపురించినా, బతకడమే కష్టమైనా తమ తెలుగుదనాన్ని కాపాడుకుంటూ విజయం సాధించిన వీరపుత్రులు వీళ్లు.

7. బతుకు దుర్భరం కావడం

దుర్భరం (దుస్+భరం) కావడం అంటే భరించడం చాలా కష్టం కావడం లేదా భరించలేకపోవడం. తిండి సరిగ్గా దొరకకపోయినా, మనసుకు తీవ్రవిఘాతం కలిగినా, కష్టాలు చుట్టుముట్టినా, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసినా బతుకు దుర్భరమవుతుంది. నిజాం పాలనా కాలంలో పై సమస్యలన్నీ ఇక్కడి ప్రజలను చట్టుముట్టి ఊపిరి సలపనీయకుండా చేశాయ్. అప్పుడు తెలంగాణ లోని సామాన్యులందరి బతుకు దుర్భరంగా మారింది.

8. ఆకాశాన జెండాలు రెపరెపలాడటం

జెండాలు రెపరెపలాడటం అంటే గర్వంగా అందరి ముందూ తలెత్తుకొని నిలబడటం అని అర్థం. సాధారణంగా జెండాలను యుద్ధంలో రథాలమీద, అంబారీల మీద ధరిస్తారు. విజయం సాధించిన ప్పుడు ఆ జెండాలు రెపరెపలాడటం సైనికుల్లో, నాయకుల్లో ఆనందోత్సాహాలను నింపుతాయి. ఆకాశాన ‘జెండాలు రెపరెపలాడటం’ అంటే-ఎంతో ఎత్తున, అందరికీ కనబడేటట్లు/తెలిసేటట్లు విజయ గర్వాన్ని ప్రదర్శించడం అని అర్థం. ‘రుద్రమదేవి యుద్ధంలో తన ప్రతాపాన్ని చూపించిన రోజు తెలుగు జెండాలు ఆకాశంలో నర్తించాయని దాశరథీ వర్ణించడంలో ఉద్దేశం కూడా అదే. తెలుగు రాణి రుద్రమదేవి విజయం లోకమంతటికీ తెలిసిందని చాటి చెప్పడం.

 

ఉ. ఓ తెలంగాణ! నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములీ

భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఓ

హోం! తెలవార్చివేసినవి ఒక్కొక దిక్కు నవోదయార్కరుక్

ప్రీత జలేజ సూన తరళీకృత దేవనధితరంగముల్

 

ఓ తెలంగాణ              =   ఓ తెలంగాణమా!

నీ                           =   నీ యొక్క

పెదవులు  + ఒత్తిన     =   నీ పెదవులతో ఊదిన

శంఖ                       =   శంఖముల యొక్క

మహారవమ్ములు         =   పెను శబ్దాలు

ఈ భూతలము +ఎల్లన్ =   ఈ భూమండలం మొత్తం

ఒక్క మొగి                 =   ఒక్కసారిగా

బొబ్బలు పెట్టిన +అట్లు =   బొబ్బలు పెట్టినట్టుగా

తోచెన్                      =   తోచింది

నవ + ఉదయ           =   అపుడే ఉదయించిన

రుక్                         =   సూర్యకిరణాల చేత/కాంతి చేత  

ప్రీత                        =   సంతోషాన్ని పొందిన

జలేజ                       =   తామర

సూన                        =   పుష్పాలచేత

తరళీకృత                 =   కదలాడే

దేవనది                    =   గంగానది యొక్క

తరంగము                 =   కెరటాలు

తెలవార్చి                  =   తెల్లారేలా

వేసినవి                    =   చేశాయి

  

తాత్పర్యం:

భావం: ఓ తెలంగాణమా! నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండల మంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి.ఆహా! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలతో చలించిన ఆకాశగంగాతరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.

శా.తల్లీ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్

డుల్లెన్ కొన్ని తరాలదాక! ఇపుడడ్డుల్ వోయె; సౌదామనీ

వల్లి పుల్లవిభావళుల్ బ్రతుకుత్రోవలజూపు కాలమ్ములున్

మళ్లేన్! స్వచ్ఛతజ్జ్వల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్

తల్లీ                      =  అమ్మా!

నీ                         =  నీయొక్క

ప్రతిభావిశేషములు    =  ప్రజ్ఞా విశేషాలు

కొన్ని తరాలదాక      =  కొన్ని తరాల వరకు

భూతప్రేత              =  చెడు శక్తుల (భూతప్రేతాల)

హస్తమ్ములన్           =  చేతులలో

డుల్లెన్                  =  పడిపోయినవి (చిక్కుకున్నవి)

ఇపుడు                  =  ఇప్పుడు

అడ్డుల్ + పోయెన్   =  అడ్డంకులు తొలగిపోయాయి

సౌదావనీవల్లీ          =  మెరుపుతీగల

పుల్ల                     =  విచ్చుకున్న

విభా + అవళుల్     =  కాంతులవరుసలు

బ్రతుకుత్రోవల్       =  బ్రతుకు దారులను

చూపు                   =  చూపే

కాలమ్ములున్         =  సమయములు

మళ్లేన్                  =  తిరిగివచ్చినవి(అదిగో)

స్వచ్ఛతర             =  అత్యంత స్వచ్ఛమైన

ఉజ్జ్వల                 =  ప్రకాశవంతమైన

ప్రథమ సంధ్యా       =  తొలి పొద్దు

భానువు                 =  సూర్యుడు

ఏతెంచెడిన్            =  వస్తున్నాడు(ఉదయిస్తున్నాడు)

భావం: అమ్మా! తెలంగాణమా! నీ గొప్పతనము విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి.ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి.విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది.స్వచ్ఛమైన కాంతివంతమైన సూర్యుడు ఉదయించాడు.