Home SSC 8th Class తెలుగు ( 8వ తరగతి )

పార్ట్ - II

 

                                                   II

చ. చదువది  యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

    చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరేచ్చటం

    బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

    పొదవెడు నప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా!

                                            భాస్కర శతకం -  మారదా వెంకయ్య

ప్రతి పదార్థం

భాస్కరా !            =    ఓ భాస్కరుడా !

చదువు + అది     =   చదువు

ఎంత +కల్గినన్    =   ఎంత ఉన్నా

రసజ్ఞత              =   ఔచిత్యం

ఇంచుక              =   ఒకింత

చాలక + ఉన్నన్  =    లేకుంటే

ఆ చదువు           =    ఆ విద్య అంతా

నిరర్ధకంబు          =    వ్యర్థం

ఎచ్చటన్            =    ఎక్కడా

గుణసంయుతులు = సద్గుణ సంపన్నులు

ఎవ్వరు               =    ఎవరూ

మెచ్చరు             =    మెచ్చుకోరు

పదునుగా            =    మిక్కిలి నేర్పుతో

మంచికుర           =    మంచి కూర

అందున్              =    ఆ కూరలో

ఇంపు +ఒదవెడు   =    రుచి కల్గించే

ఉప్పు                 =    ఉప్పు

లేక                    =    వేయకపోతే

రుచి                   =    రుచి

 

భావం:భాస్కరా ! ఎంత గొప్ప చదువులు చదివిన కొద్దిగా విచక్షణ లేకపోతే ఆ చదువు వ్యర్థం.సద్గుణులు ఎవ్వరు మెచ్చుకోరు.నాలుక స్వయంగా వండినా కూరలో ఉప్పు వేయకపోతే రుచి పుడుతుందా?

ఇక్కడ కవి విచక్షణ ఉప్పుతోను,గొప్ప చదువును నలుని వంటి వాణి కూరతోను సమయం చూపాడు.సామాన్య విషయంతో సమర్దించాడు కనుక ఇది అర్దాంతరన్యాసాలంకారం.

 

ఉ.పెంపునదల్లివై,కలుషబృంద సమాగమ మొందకుండ ర

    క్షింపను దండ్రివై,మెయి వసించు దశేన్ద్రియ  రోగముల్ నివా

    రింపను వెజ్జువై,కృపగుఱించి పరంబు దిరంబుగాగ స

    త్సంపద లీయ నీవెగతి దాశరథి! కరుణా పయోనిధి!

                                           దాశరథి శతకం - కంచర్ల గోపన్న

దాశరథి !               =    దశరథుని పుత్రుడైన ఓ రామా!

కరుణాపయోనిధీ !    =    సముద్రమంతటి దయా కలవాడా!

పెంపునఁ               =    నన్ను పెంచడంలో

తల్లివి + ఐ            =    తల్లివై

కలుషబృంద         =    పాప సమూహాల

సమగమము          =    కలయిక

ఒందకుండా          =   నన్ను తాకకుండా

రక్షింపను             =   రక్షించడంలో

తండ్రివై              =    నాకు తండ్రివై

మెయి                 =   నా శరీరంలో

వసించు              =   నివాసం ఉన్న

నివారింపను         =   నివారించడానికి

వెజ్జువై                =   వైద్యుడవై

కృప గుణించి       =   కృపతో

పరంబు              =  మోక్షం

ఈయన్              =  ఇచ్చుటకు

గతి నీవే             =   సద్గతి నీవే !

భావం: దశరథ కుమారుడైన ఓ రామ ! దయ సముద్ర !నన్ను పెంచడంలో నీవే తల్లివి.పాపములు అంటకుండా రక్షించడంలో నీవే తల్లివి.ఇంద్రియాలనే రోగాలు నివారించడంలో నా పాలిటి వైద్యుడివి.కృపతో నాకు మోక్షం శాశ్వతం చేసే గొప్ప సంపదలియవయ్యా !

 

సీ. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు

    వెళ్ళిపోయెడినాడు వెంటరాదు

    లక్షాధికారైన లవణమన్నమె కానీ

    మెఱుగు బంగారంబు మ్రిOగంబోడు

    విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటే కానీ,

    కూడఁబెట్టిన సొమ్ముంగుడువంబోడు

    పొందుగా మఱుగైన భూమిలోపలపెట్టి

     దానధర్మము లేక దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో? దొరలకవునో?

    తేనె జుంటీగలియ్యవా తెరువరులకు

   భూషణ వికాస!శ్రీ ధర్మవుర నివాస

   దుష్ట సంహార!నరసింహ! దురితదూర!

                               నరసింహ శతకం - కాకుత్స్థం  శేషప్పకవి

భావం: ధర్మపురి నివాసుడైన ఓ నృసింహ ! మనిషి పోయేటప్పుడు  ఏమి పట్టుకుపోడు. ఎంత సంపాదించినా ఉప్పు,అన్నము తినాల్సిందే.లక్షలార్జించి అహంకారంతో వర్తించి,ఎవరికీ దానమీయక దాచి తుదకు దొంగలపాలో,దొరలపాలో చేస్తూ వుంటారు.తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె తుదకు బాటసారుల పాలవుతుంది కదా !

ఇక్కడ ఒక విశేష విషయాన్నీ సామాన్య విషయంతో సమర్దించి చెప్పనైనది కనుక అర్దాంతరన్యాసాలంకారం.